కెసిఆర్ ఫామ్ హౌస్ లో తెలంగాణ తల్లి బందీ: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ తల్లి సిఎం కెసిఆర్ ఫామ్ హౌస్ లో బందీ అయ్యిందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, జోగులాంబ తల్లి దయతో పాటు సోనియాగాంధీ ఆశీస్సులతో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇవాళ గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కెసిఆర్, కెటిఆర్, కవిత, సంతోష్ రావు చేతిలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బందీ అయ్యారన్నారు. కెసిఆర్ సిఎం అయిన తరువాత రైతుల ఆత్మహత్యలు, ఎన్ కౌంటర్లు ఆగలేదన్నారు.
గులాబీ చీడను రాష్ట్రం పొలిమెరలు దాటే వరకు తన్ని తరిమేయాలన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఏపిలో కాంగ్రెస్ చచ్చిపోయినా పర్వాలేదని తెలంగాణ ఇస్తే సోనియా కు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మనకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అవసరం లేదని, కాని పాదరసం లాంటి కార్యకర్తలే పికెలు అని ఆయన అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనకు పాతరేసేందుకు ప్రతి కార్యకర్త పోరాడేందుకు ఇంట్లో అనుమతి తీసుకోవాలని రేవంత్ పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. వ్యక్తిగతంగా నినాదాలు చేయవద్దని, సోనియా గాంధీకి అనుకూలంగా నినాదాలు చేయాలని స్పష్టం చేశారు. తన పేరుతో నినాదాలు చేస్తే చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.