తెలంగాణ ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం: టీటీడీ

తిరుమల: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపిల సిఫారసు లేఖలను తిరుమలలో తిరస్కరిస్తున్నారనే దుష్ప్రచారాన్ని టిటిడి ఖండించింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గతంలో ఏ విధానం అమలు జరిగేదో ఇప్పుడు కూడా అలాగే అమలు జరుగుతోందని స్పష్టం చేసింది.
గతవారం కొందరు ప్రజా ప్రతినిధులు వారి కోటాకు మించి లేఖలు ఇచ్చి తిరుమలకు పంపించారు. విఐపి బ్రేక్ దర్శనం సమయం తక్కువగా ఉండటం, ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు రావడంతో కోటాకు మించి వచ్చిన లేఖలను తిరస్కరించడం జరిగింది.

అయినప్పటికీ కొందరు ఫోన్ చేసి తమకు ముఖ్యమైన వారని చెప్పడంతో వారికి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంజూరు చేసి స్వామివారి దర్శనం కల్పించాం. అలాగే గదులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించడం జరుగుతోంది. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు వ్యక్తులు ఆరోపణలు చేయడం తగదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
తెలంగాణ నుంచి వెళ్లే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి శనివారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు. టిటిడి ఈఓ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు సిఫారసు లేఖలు బుట్ట దాఖలు అవుతున్నాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ లేఖలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావద్దా? ఇలాంటి వివాదాలు పెరిగితే రానున్న రోజుల్లో ఇరు రాష్ట్రాల మధ్య విభేధాలు ముదురుతాయని ఆయన హెచ్చరించారు. సిఫారసు లేఖలు బుట్టదాఖలు చేస్తుండడంతో తెలంగాణ భక్తులు టిటిడి ఈఓ, జాయింట్ ఈఓ ఆఫీసుల ముందు ధర్నా చేశారని జయప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.