పెట్రోల్ పై ఫిప్టీ ఫిప్టీ దోపిడి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిప్టి ఫిప్టి దోచుకుంటున్నారని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. చెరో రూ.30చొప్పున దోచుకోవడం మూలంగా పెట్రోల్ ధర రూ.100 దాటిందని ఆయన విమర్శించారు.

రెండు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనను తిప్పి కొట్టేందుకు ప్రజలు రోడ్ల మీదికి రావాలన్నారు. శుక్రవారం నాడు ఇందిరా పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్రగా వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై గవర్నర్ కు వినతి పత్రం అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్ మళ్లీ మోసానికి ప్లాన్ వేశారని, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై సర్కస్ ఫిట్లు చేస్తున్నారన్నారు. ఖాళీలెన్నో తేల్చాలని తాజాగా హడావుడి చేస్తున్నారని, మోసం చేయడానికే ఈ డ్రామా అని ఆయన విరుచుకుపడ్డారు. 2020 లో బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 ఉద్యోగ ఖాళీలు ఉండగా, మళ్లీ నివేదికలు ఏంటని ఆయన ప్రశ్నించారు. ఖాళీలు అంత భారీగా ఉంటే, 56వేలు దాటడం లేదని దొంగ లెక్కలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేషన్లలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.