ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 19 రోజుల పాటు అంటే ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి.
లోకసభ, రాజ్యసభ కరోనాకు పూర్వం ఉన్న వేళల ప్రకారమే ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయి. పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. మొత్తం 29 కొత్త బిల్లులను, రెండు ఆర్థిక బిల్లులను ఆమోదం కోసం ప్రవేశపెడతారు. పార్లమెంటు సమావేశాల్లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ప్రధానం రైతు సాగు చట్టాల ఉపసంహరణ, రాఫేల్ కుంభకోణం, కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం, వ్యాక్సినేషన్ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. రక్షణ ఉత్పత్తుల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన తెలపకూడదనే వివాదాస్పద బిల్లు కూడా ఉంది. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించేలా కేంద్రానికి అధికారం కల్పించే సినిమాటోగ్రఫి బిల్లును కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలిసింది.