భక్తులు మీదికి దూసుకెళ్లిన లారీ
చిత్తూరు: కాలి నడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకు వెళ్లడంతో ఒకరు మృతి చెందగా, ఇరువురు పరిస్థితి విషమంగా ఉంది. మరో 7మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటన ఇవాళ తెల్లవారు జామున వడమాలపేట మండలం అంజారమ్మ కణం వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు వేలచ్చేరి కు చెందిన 15 మంది భక్తుల బృందం శ్రీవారి దర్శనానికి బయలుదేరారు.
తిరుమల కు కాలినడకన వస్తుండగా లారీ డ్రైవర్ కునుకు తీసి భక్తులను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు. ఘటనా స్థలానికి వడమాలపేట పోలీసులు చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన తరువాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పోలీసులు లారీ ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.