కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమల్ నాథ్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, తనయుడు రాహుల్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ తరువాత పార్టీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సోనియాతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంతరి కమల్ నాథ్ గంటపాటు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు కాంగ్రెసేతర పార్టీల పరిస్థితిపై ఆరా తీశారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ సమన్వయం చేయాలని ప్రశాంత్ కిశోర్ సోనియాకు ఇటీవల సూచించారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను సమన్వయం చేసేందుకు కమల్ నాథ్ సమర్థుడని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. బిజేపియేతర పార్టీలను కూడగట్టగలరన్న నమ్మకంతో ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని సోనియా నిర్థారణకు వచ్చారు. అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉండడంతో కమల్ నాథ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నది. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా, కమల్ నాథ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.