మొక్కలు చనిపోతే సర్పంచ్‌లపై వేటు, మంత్రి వార్నింగ్

సర్పంచ్ లు, అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మొక్కల సంరక్షణ బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు. ఒకవేళ మొక్కలు చనిపోతే వేటు పడుతుందని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి 17వేల కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది కోటి మొక్కల్ని నాటేందుకు ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా.. రాష్ట్రంలో పచ్చదనం విలసిల్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. పచ్చతోరణం కార్యక్రమం నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ 13 జిల్లాల అధికారులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం వర్క్‌షాప్‌ జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది సీఎం జగన్ సంకల్పమని, నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది ఆయన లక్ష్యమని మంత్రి చెప్పారు.

గతంలో మాదిరిగా మొక్క నాటడంతో సరిపెట్టడం లేదని, ప్రతి మొక్క సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసే వీలు కల్పించామని చెప్పారు. మొక్కలకు నీటి తడులు అందించేందుకు ప్రతినెలా డబ్బులు కూడా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీలో నాటిన మొక్కల్లో కనీసం 83 శాతం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ఆ గ్రామ సర్పంచ్‌పై పెడుతున్నట్టు చెప్పారు. లేనిపక్షంలో వారు పదవికి అనర్హులుగా ప్రకటించేలా నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

”జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా నాటిన మొక్కల్లో 83శాతం బతకాలి. లేదంటే సర్పంచ్ లపై అనర్హత వేటు వేస్తాం. ఈ మేరకు చట్టం కూడా చేశాము. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే అధికారులపైనా చర్యలు తప్పవు. మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కర్నాటక, తెలంగాణకు అధికారులు వెళ్లి పరిశీలించాలి” అని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.

మొక్కల సంరక్షణ బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి మొక్కకు నెలకు నాలుగు తడుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి తడికి రూ.5 చొప్పున కిలోమీటర్‌ పరిధిలో కనీసం 400 మొక్కల్ని సంరక్షిస్తే నెలకు రూ.8 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 10 కిలోమీటర్ల పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొనే వారు ట్రాక్టరు కొనుక్కుంటే రెండేళ్లు తిరిగే సరికి అతనికి కొనుగోలు ఖర్చు లభించి ట్రాక్టరు మిగిలే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ ఏడాది మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొలి మూడు జిల్లాల అధికారులను సీఎం జగన్ సమక్షంలో సన్మానిస్తామని, అదే సమయంలో చివరి మూడు స్థానాల్లో నిలిచే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ ఏడాది 44వేల మంది రైతులకు చెందిన 70వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలు నిర్వహించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.