హెచ్.పి.ఎస్ కు షాకిచ్చిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరెంట్స్ ఫోరం సభ్యులు హైకోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్ లైన్ తరగతులు బోధించడం లేదని పిటిషనర్లు హైకోర్టుకు ఆరోపించారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాక్టివ్ పేరంట్స్ ఫోరం అప్పీలుపై ఇవాళ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ ఏడాది పది శాతం ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు.. రూ.10వేలు తగ్గించామని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం విధిస్తున్న ఫీజులు ఎంత, ఎంతశాతం తగ్గించారో తెలిపాలని హైకోర్టు సూచించింది. ఫీజు లు చెల్లించలేదని విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు ఎలా ఆపుతారని ప్రశ్నించింది. ఇలాంటి చర్యలు తీసుకున్నారంటే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. లాభాపేక్ష లేని సొసైటీ కూడా కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరిస్తే ఎలా అని హైకోర్టు మండిపడింది. కరోనా విపత్తు వేళ మానవత్వంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ఫీజులతో ముడిపెట్టకుండా ఆన్ లైన్ బోధన కొనసాగించాలని స్పష్టం చేసింది. అసలు విద్యా సంస్థలో ఎంత మంది చదువుతున్నారు, ఎంత మంది చెల్లించారు, ఎంత మొత్తం చెల్లిస్తున్నారు, ఎంత మేర ఫీజులు చెల్లించాలనే వివరాలు అఫిడవిట్ రూపంలో అందచేయాలని హైకోర్టు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 13కి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.