కరోనాతో చనిపోతే రైతు రుణాలు మాఫీ: కర్ణాటక
బెంగళూరు: కరోనా వైరస్ తో చనిపోయిన రైతుల రుణాలను వడ్డీతో సహా మాఫీ చేయాలనే యోచన పరిశీలనలో ఉందని కర్ణాటక సహకార శాఖ మంత్రి ఎస్.టి.సోమశేఖర్ తెలిపారు.
అయితే వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రుణాలను తీసుకున్నవారి విషయంలోనే ఈ నిర్ణయం అమలు చేయాలని అనుకుంటున్నామని ఆయన మీడియాకు చెప్పారు.
త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని సిఎం బి.ఎస్.యడ్యూరప్ప ప్రకటిస్తారన్నారు. మాఫీ అయిన రుణాలతో పాటు వడ్డీ మొత్తాన్ని సహకార సంఘాలకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో చేసిన అప్పులను మాఫీ చేసే యోచన లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నదని, మళ్లీ కాంగ్రెస్ గూటికి వెళ్లాల్సిన గత్యంతరం లేదని మంత్రి సోమశేఖర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.