జమ్మూ కాశ్మీర్ లో బేజారెత్తిస్తున్న డ్రోన్లు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో డ్రోన్ల కలకలం ఇంకా కొనసాగుతునే ఉంది. తొలిసారి డ్రోన్లతో వైమానిక స్థావరంపై దాడులు చేసిన తీవ్రవాదులు 24 గంటలు గడవక ముందే మరోసారి దాడికి యత్నించి విఫలమయ్యారు.
భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో వెనక్కి తగ్గారు. తాజాగా మళ్లీ శుక్రవారం వేకువ జామున పాకిస్థాన్ వైపు నుంచి డ్రోను సరిహద్దులు దాటే ప్రయత్నం చేసింది. బిఎస్ఎఫ్ సైనికులు గుర్తించి వెంటనే కాల్పులు జరపడంతో వెనక్కి వెళ్లింది. జమ్మూలోని వైమానిక స్థావరంపై ఆదివారం తెల్లవారు జామున డ్రోన్ దాడులు నిర్వహించి పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతున్నది. 24 గంటలు కూడా గడవక ముందే రత్నచుక్ సైనిక ప్రాంతంలో డ్రోన్ దాడికి సిద్ధం కాగా సైనికులు కాల్పులు జరిపిపి తిప్పి కొట్టారు.