భువనగిరి కోట అభివృద్ధి చేయాలి: ఎంపి వెంకట్ రెడ్డి

న్యూఢిల్లీ: ఎంతో చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మీరు నూతనంగా చేపట్టిన పర్యాటక రంగంలో నూతన విధానాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. విజ్ఞాన్ భవన్ లోకేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందచేశారు.

భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న చారిత్రక ప్రదేశం భువనగిరి కోట అభివృద్ధికి సాయం చేయాలని వెంకట్ రెడ్డి కోరారు. తెలంగాణ వ్యక్తిగా కిషన్ రెడ్డికి భువనగిరి కోట విశిష్టత తెలుసని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కోట అభివృద్ధికి సహకరించడం లేదని వెల్లడించారు. నేటికి దేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నా పట్టించుకోకపోవడంతో కాలగమనంలో చరిత్రలో కలిసి పోయాయని అన్నారు. పట్టించుకోనట్లయితే భువనగిరి కోట అలాగే అవుతుందని తెలిపారు. కాబట్టి పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించి నిధులను వెంటనే మంజూరు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని ఎంపి వెంకట్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.