బంగ్లా ప్రమాదంలో 52 మంది దుర్మరణం
ఢాకా: దేశ రాజధాని శివార్లలోని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించడంతో 52 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయి.
రూప్గంజ్లోని ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఆరు అంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే భారీ నష్టం జరిగింది. ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో పెద్ద సంఖ్యలో చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి అగ్ని మాపక శకటాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. తగలబడుతున్న ఫ్యాక్టరీ నుంచి 52 మృతదేహాలు వెలికితీశారు. సహాయక చర్యలు పూర్తయితే కాని ఎంత మంది చనిపోయింది చెప్పలేమని పోలీసులు వెల్లడించారు.