దారుణం.. మొబైల్ కోసం కన్నకూతురిని తాకట్టు పెట్టిన తండ్రి!
కూతురికి మొదటి హీరో తండ్రే అని గొప్పగా చెప్పుకుంటారు. కష్టం వస్తుందని ముందుగానే పసిగట్టి వారికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు తండ్రి. అలాంటి తండ్రే పిల్లల పాలిట యమదూతగా మారాడు. పిల్లలను తాకట్టు పెట్టాడంటే ఏదో బలమైన కారణం ఉందనుకుంటే పొరపాటే! తండ్రి జల్సాల కోసం మూడు నెలల బిడ్డను అమ్మేశాడు. వాటితో ఫోన్, బైక్ కొనుగోలు చేశాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన మూడు నెలల ఆడబిడ్డను రూ.లక్షకు అమ్మేశాడు.
రూ.15వేలు పెట్టి మొబైల్, రూ.50 వేలు పెట్టి బైక్ కొన్నాడు. ఈ వస్తువులు కొనడానికి అతనికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని గ్రామస్థులకు అనుమానం వచ్చింది. ఆ సమయంలోనే పసిపాప కూడా కనబడడం లేదు. ఈ విషయాన్ని గ్రాస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. మరి తండ్రి ఈ దారుణానికి పాల్పడితే తల్లి ఏం చేస్తుందని ఆమెను కూడా విచారించారు పోలీసులు. నన్ను బెదిరించి బిడ్డను తీసుకెళ్లిపోయాడని తల్లి వాపోయింది. ఖర్చులకు డబ్బు వస్తుందిలే అని భార్యభర్తలు కలిసి ఈ పనిచేసుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.