చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడి కి కరోనా.?

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు టోర్నీ ప్రారంభం కాకముందే షాక్ తగిలింది. ఆ బృందంలో కొందరు సభ్యులు/సిబ్బంది కొవిడ్‌-19 బారిన పడ్డారని తెలిసింది. టీ20ల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పేసర్‌, సామాజిక మాధ్యమ సిబ్బంది, నిర్వాహక బృందంలోని సీనియర్‌ అధికారి, ఆయన సతీమణికి కరోనా వైరస్‌ సోకిందని సమాచారం. ధోనీ సేన ఈ నెల 21న దుబాయ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బీసీసీఐ నిర్వాహక ప్రక్రియ ప్రకారం బృందానికి వరుసగా ఒకటి, మూడు, ఆరో రోజు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. అందులోనే కొంతమందికి పాజిటివ్‌ వచ్చినట్టు దుబాయ్‌ వర్గాలు పీటీఐకి తెలిపాయి. ‘టీమ్‌ఇండియాకు ఈ మధ్యే ఆడిన కుడి చేతి వాటం మీడియం పాస్ట్‌ బౌలర్‌ ఒకరు, సిబ్బందిలో కొందరికి కొవిడ్‌-19 సోకింది. సీఎస్‌కే నిర్వాహక బృందంలోని సీనియర్‌ అధికారి, ఆయన భార్యకు, సోషల్‌ మీడియా బృందంలో కొందరికి వైరస్‌ సోకింది’ అని ఆ వర్గాలు తెలిపాయి. కాగా సిబ్బందిలో 12 మందికే కరోనా సోకినట్టు కొన్ని వెబ్‌సైట్లు రాస్తున్నాయి. ఈ మొత్తం విషయమై చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఆటగాడు, సిబ్బందికి వైరస్‌ సోకడంతో సీఎస్కే బృందం సెప్టెంబర్‌ ఒకటి వరకు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. కొవిడ్‌-19 బాధితులు మాత్రం అదనంగా మరో ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. మరోసారి పరీక్షించి... నెగెటివ్‌ వచ్చాకే వారు బయో బుడగలో అడుగుపెడతారు. మిగిలిన అందరికీ శుక్రవారం మరోసారి (నాలుగోసారి) పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం దుబాయ్‌కి బయల్దేరే 24 గంటల ముందు ఆటగాళ్లకు రెండుసార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేశారు. అప్పుడు నెగెటివ్‌ వచ్చింది కాబట్టే అందరూ విమానంలో ప్రయాణించారు. అంటే దుబాయ్‌కి చేరుకున్నాకే వారికి కొవిడ్‌ సోకినట్టు భావిస్తున్నారు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌లో టీమ్‌ఇండియాకు ఆడుతున్న ఇద్దరు మీడియం ఫాస్ట్‌ పేసర్లు దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌. ఇద్దరిదీ కుడిచేతి వాటమే. శార్దూల్‌ ఏడాదిన్నరగా భారత జట్టుకు ఎంపికవుతుండగా తాజాగా ఎంపికైంది మాత్రం చాహరే కావడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.