24 గంటల పాటు ఊరి చివర పొలాల్లోనే యువకుడి మృతదేహం..

కరోనా వైరస్‌ వల్ల ప్రజల్లో ఏర్పడిన భయం వారిలోని మానవత్వాన్ని సైతం చంపేస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరిప్రసాద్‌ అనే యువకుడు బెంగళూరు నుంచి సొంత గ్రామమైన ఆ జిల్లాలోని రామసముద్రంకి కాలినడకన వచ్చాడు. దీంతో తీవ్రంగా అలసిపోయి, అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషాద సమయంలో దగ్గరి బంధువులు సైతం ఆ యువకుడి కుటుంబానికి అండగా నిలవలేదు. కరోనా సోకే ఆ యువకుడు చనిపోయి ఉంటాడని, కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు జరపలేదు. దాదాపు 24 గంటల పాటు ఊరు చివర పొలాల్లోనే అతడి మృతదేహం ఉండిపోయింది.

సొంత బంధువులే మృతదేహాన్ని ముట్టుకోవడానికి భయపడుతుండడంతో చివరకు పోలీసులు, వైద్యులు అక్కడకు చేరుకుని, మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. నమూనా పరీక్షలు వచ్చేవరకు మృతదేహం వద్ద రెవెన్యూ సిబ్బందే కాపలాగా ఉన్నారు. చివరకు నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రకటించారు. నెగిటివ్‌ వచ్చిందని తెలిశాక బంధువులు ముందుకు వచ్చి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.